వార్తలు.. విశేషాలు.. 
 ప్రత్యేక కధనాలు

దేశ భాషలందు తెలుగు లెస్స 

భారత దేశ భాషల్లో తెలుగు మధురమైనదని ఇచ్చాపురం పట్టణంలోని స్వర్ణభారతి విద్యా సంస్థల చైర్మన్ సీహెచ్.తులసీదాస్ రెడ్డి అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు భాషాభివృద్ధికి విశేష సేవలందించిన గిడుగు రామమూర్తి పంతులు చిత్ర పటానికి ముందుగా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ తాము ఆంగ్ల మాధ్యమ పాఠశాల నిర్వహిస్తున్నప్పటికి మాతృ భాష తెలుగు బోధనా విషయంలో ప్రత్యెక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. దాని ఫలితంగానే పదవ తరగతి పరీక్ష తెలుగులో తమ విద్యార్ధులు 1౦ గ్రాడ్ పాయింట్లతో ఉత్తీర్నులవుతున్నారన్నారు. తెలుగు భాశాభివృద్ధికి గిడుగు రామమూర్తి పంతులు అందించిన విశేష సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రెడ్డి, తెలుగు ఉపాధ్యాయని ఆర్.సుభాషిణి, తోటి ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. 

ఘనంగా ఉట్ల సంబరం 

కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఇచ్చాపురం పట్టణంలో శనివారం ఉట్ల సంబరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కండ్ర వీధి శ్రీకృష్ణ మండపం వద్ద ప్రత్యెక పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహ తిరువీధి కార్యక్రమం చేపట్టారు. మేళతాలాలూ, సాంస్కృతిక ప్రదర్సనలతో వీధుల్లో కృష్ణ పరమాత్ముని ఊరీగించారు. యాదవ కుల సంఘం ఆధ్వర్యంలో పెద్దపోస్తాఫీసు, బ్రాహ్మణ, గొర్జీ వీధులు, బలరంపేట, గొల్లవీధి, వీకేపేట, దాసన్నపేట, బెల్లుపడ కోలనిలలో ఏర్పాటు చేసిన ఉట్లను యువత ఉత్సాహంతో కొట్టారు. కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సేవానిరతితో సంతృప్తి 

సహాయం చేయటానికి డబ్బు ఉంటె సరిపోదు, మంచి మనసు ఉండాలి అనే మధర్ తెరిస్సా ఉద్భోదలకు ఎందరో స్పూర్తి పొందుతున్నారు. ఆమె అడుగుజాడల్లో నిరుపేదలకు, వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్నారు. చేసిన సేవలకు ప్రచారం ఆశించకుండా సేవానిరతిని కొనసాగిస్తున్నారు. కాని వారు చేస్తున్న సేవలు పదిమందికి తెలిస్తే తద్వారా మరి కొంతమంది స్పూర్తి పొందుతారని గమనించాల్సి ఉంది. తద్వారానే సమాజాభివృద్ధి సాధ్యపడుతుంది. ఆ కోవలో స్పూర్తి పెంపొందించే సంఘటనలను ఇచ్చాపురం.కాం మీ ముందుంచుతుంది. మధర్ తెరిస్సా 106వ జయంతి సందర్భంగా ఇచ్చాపురం పురపాలక సంఘంలోని పురుసోత్తపురం గ్రామా ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు డి.లోకేశ్వర రావు అధ్యక్షతన శనివారం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన డి.సుమన్ కుమారుడు ధనుష్ చెముడు, మూగతనంతో భాదపడుతుండటం, అంగ వైకల్య నిర్మూలనకు తగిన ఆర్ధిక స్థోమత లేకపోవటం గమనించిన 1వ వార్డు కౌన్సిలర్ ఎస్.ప్రేమకుమార్ తన వంతుగా ఆర్ధిక సహాయాన్ని అందించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి పి.రజ్యలక్ష్మి చేతుల మీదుగా రూ.10వేలు నగదు బాలుని తల్లిదండ్రులకు అందించారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ తోపాటు మున్సిపల్ కమీషనర్ పి.రవిబాబు మాట్లాడుతూ సమాజంలో పౌరులతోపాటు విద్యార్ధుల్లో కుడా సేవా భావాన్ని పెంపొంది౦చాలన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. 


శక్తి, ముక్తి ప్రదాయని స్వేచ్ఛావతి అమ్మవారు 

శక్తి, ముక్తి ప్రదాయని స్వేచ్చావతి అమ్మవారు. ఆమె పేరు తలచుకొని చేపట్టే కార్యక్రమాలు తప్పకుండా విజయవంతం అవుతాయని ప్రజల నమ్మకం. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఆంధ్రప్రదేశ్, ఓడిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రసిద్ది. ఇలా శతాబ్దాల చరిత్ర కలిగిన అమ్మవారి జీవిత చరిత్ర ఒకసారి మననం చేసుకుందాం.

శతాబ్దాల చరిత్ర : కొన్ని వందల ఏళ్ల క్రితం అమ్మవారు ఇచ్చాపురంలో వెలిసారని ప్రచారంలో ఉంది. అప్పట్లో చిన్న పెంకుటింట్లో అమ్మవారిని మాలి కుటుంబీకులు పూజిస్తున్దేవారు. 1977వ సంవత్సరంలో సంబరాలు జరిగిన అనంతరం స్థానికులు ఆలయ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసారు. విరాళాలు సేకరించి ఆరు ఎకరాల స్థలాన్ని సమకూర్చి అభివృద్ధి పరిచేందుకు నిర్ణయించారు. 1985-2000 సంవత్సరాల మధ్య ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్ది ప్రత్యెక భజన మందిరం, ప్రసాద విక్రయ శాల, వసతి గృహలను నిర్మించారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ బి.త్రినాధరెడ్డి హయంలో జడ్పి నిధులతో ఆలయ ప్రాంగణంలో సామాజిక భవనాన్ని నిర్మించారు. నాటి నుంచి కమిటీ సేకరించిన నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

అమ్మవారి ఉద్భవం : నవాబుల నాటి కాలంలో అరణ్యమయమై ఉన్న ఈ చిన్న కుగ్రామంలో కరువు కాటకాలు, కలరా, మసూచి వ్యాధుల బారిన పడి అనేక మంది మృతి చెందటంతో భయబ్రాంతులకు గురైన స్థానికులు వలసపోవటం ప్రారంభించారని పూర్వీకుల కధనం. గ్రామం వీడటం ఇష్టపడని ఒక రైతు వ్యవసాయం చేస్తుండగా పొలంలో నాగలి చిక్కుకుపోవటంతో అమ్మవారి ప్రతిమ బయిటపడిందని వినికిడి. దీంతో అక్కడ అమ్మవారి ఆలయం నిర్మించినట్లు చేబుతారు. అప్పటి నుంచి మాలి కుటుంబీకులు ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు.

నాటి స్వేచ్చాపురమే నేటి ఇచ్చాపురం : గ్రామా దేవత స్వేచ్చావతి అమ్మవారి పేరే పరిణామ క్రమంలో ఇచ్చాపురంగా మారిందని పూర్వీకుల ఉవాచ. ఉత్కళ కళింగ రాజ్యంలో ఒడిస్సా గంజాం పరిధిలో గల ఈ గ్రామ పేరులో ఉన్న స్వేచ్చ అనే పదానికి ఒడియాలో ఇచ్చగా సంబోదిస్తారు. దీంతో గ్రామా ఇస్టదైవం స్వేచ్చావతి పేరు మీదున్న స్వేచ్చాపురం కాలక్రమేనా ఇచ్చాపురంగా మార్పు చెందిందని ప్రచారంలో ఉంది.

సంబరాలు.. విశేషాలు... : గత 1977వ సంవత్సరం ఏప్రెల్ నెలలో నిర్వహించిన సంబరాలు ఏకధాటిగా 35 రోజులపాటు జరిగాయి. 24 ఏళ్ల అనంతరం 2001 మే నెల ౩౦వ తేదిన ప్రారంబించిన సంబరాలు 29 రోజులపాటు జరిగాయి. 2013 ఏప్రెల్ 22వ తేదీనుంచి నిర్వహించిన సంబరాలు ఏకధాటిగా 29రోజులపాటు కొనసాగాయి.